నవ్వుకి అతడే చిరునామా

0
157

నవ్వుకి అతడే చిరునామా

భారతీయ వ్యంగ్య చిత్రానికి (కార్టూన్‌కి) ఆద్యుడు కేశవ శంకర్ పిళ్ళై. శంకర్ వీక్లీ అధినేత ఆయన. కానీ కార్టూన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది శంకర్ పేరు కాదు. ఆర్కే లక్ష్మణ్ పేరు. అవును అక్షరాలా ఆర్కే లక్ష్మణ్ పేరే – భారతీయ కార్టూన్ రంగానికీ, వ్యంగ్యానికి ఆద్యుడూ, ఆరాధ్యుడూ, దార్శనికుడూ. మార్గదర్శకుడూ ఆర్కే లక్ష్మణే.

కార్టూన్ వేరు. రాజకీయ కార్టూన్ వేరు. బొమ్మ గీయడం ఒక్కటే కరాదు, దేశ రాజకీయాలపై పూర్తి అవగాహనా, విచక్షణా, నిష్పక్షికతా, వాడి వేడి విమర్శా చేయగలగాలి. సమయం కన్నా వేగంగా పరుగెత్తే శక్తిసామర్థ్యాలుండాలి. హాస్యం పండించే చతురత తెలిసి ఉండాలి. ఎవరిపైనా కార్టూన్ చిత్రిస్తామో ఆ వ్యక్తినీ నొప్పించకూడదు. ఇవన్నీ తెలిసనవాడే రాజకీయ వ్యంగ్య చిత్రకారుడిగా రాణించగలడు. ఈ లక్షణాలన్నీ లక్ష్మణ్‌లో సంపూర్ణంగా ఉన్నాయి. అందుకే ఆయన ఐదున్నర దశాబ్దాలుగా అప్రతిహతంగా, అలుపెరగకుండా కార్టూన్లు చిత్రించగలుగుతున్నాడు. ఆనాటి తరాన్నీ ఈనాటి వేగయుగాన్నీ ఒప్పింటి మెప్పించగలిగే కార్టూన్లు గీయగలుగుతున్నది కేవలం లక్ష్మణ్ ఒక్కడే. తన ధ్యేయాన్ని గురిచూసి కొట్టగలిగే ప్రావీణ్యం ఆయన రేఖలకీ ఐడియాలకీ మాత్రమే సాధ్యం.

హాసం, హసితం, మందహాసం… ఇలానవ్వులు ఆరు రకాలున్నాయి. ప్రతి రోజు లక్ష్మణ్ కార్టూన్ చూస్తే తప్పకుండా ఏదో లెవల్లో ఈ నవ్వు గ్యారంటీ. ఇలా నిండా 55ఏళ్ళుగా నవ్విస్తూనే ఉన్నాడాయన టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ పత్రికలో వేస్తున్న కార్టూన్ల ద్వారా…

ఆయన కుంచె యుద్ధం సమాజం మీదా, అధికారం మీదా, రాజకీయాల మీదా. అది వ్యక్తిగతం కాదు, సాధారణ పౌరుని తరపున చేసే యుద్ధం అన్నట్టు ఆయన ప్రతి బొమ్మలోనూ సాధారణ వ్యక్తి ఉంటాడు. కామన్ మ్యాన్… చిరుగుల చొక్కాలో, పాతతరం కళ్ళజోడుతో మాసిన గడ్డంతో, చేతిలో సంచితో గొడుగు పట్టుకుని రకరకాల హావభావాలతో తారసపడతాడీ కామన్‌మ్యాన్. నిజమైన సాదాజీవికి నోరుండదు. అధికథల్నీ, చార్జీలనీ, పన్నుల వడ్డనల్నీ నిశ్శబ్దంగా భరిస్తాడు. అన్ని కుట్రలకీ కుతంత్రాలకీ నోరులేని సాక్షిగా నుంచుంటాడు… లక్ష్మణ్ కామన్‌మ్యాన్ కూడా అంతే. ఈ ఐదున్నర దశాబ్ధాలుగా అతను నోరు విప్పింది లేదు. అతనితో ఏదో ఒక సందర్భంలో మనల్ని మనం పోల్చుకుంటాం. అదే లక్ష్మణ్ గొప్పతనం. ఆర్కే లక్ష్మణ్ తండ్రి ఒక స్కూల్ హెడ్మాస్టర్. ఆయనకు ఆరుగురు కొడుకులు,  ఇద్దరుకూతుళ్ళు. లక్ష్మణ్ ఆరో సంతానం. చిన్నప్పటి నుంచీ క్రికెట్ ఆట అన్నా హిందూ పత్రికలో వచ్చే డేవిడ్‌లో కార్టూన్స్ అన్నా లక్ష్మణ్‌కి చచ్చేంత ప్రాణం. స్కూలూ, చదువుకు పోగా ఏ మాత్రం సమయం దొరికినా లక్ష్మణ్ ఏ వీధి మూలలోనో, మార్కెట్‌లోనో కూర్చుని వచ్చిపోయేవాళ్ళ బొమ్మ వేసేవాడు. ఆ ఇచ్చరానురాను పెరిగిందే కానీ తరగలేదు… తనో గొప్ప ఆర్టిస్టు కావాలని ఎన్నో కలలు కనేవాడు. ముంబాయి (అప్పటి బాంబే)లోని జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో అధ్యయనం కోసం దరఖాస్తు చేస్తే వాళ్ళు బొమ్మలకు పనికిరావు సీటు ఇవ్వం పొమ్మన్నారు… లక్ష్మణ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరి పాకెట్ కార్టూన్లు (యూ సెడ్ ఇట్) వేసి అతి తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. విచిత్రమేంటంటే జేజే స్కూల్ ఆఫ్ పైన్ ఆర్ట్స్ ఉన్నది టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ పక్కనే… ఆ స్కూలు వాళ్ళు కింద తాము పనికిరాడు పొమ్మన్నది ఆ లక్ష్మణ్‌నే అనే విషయం వాళ్ళు ఎరుగరు. లక్ష్మణ్ ఆ విషయాన్ని గుర్తుచేశాడట వాళ్ళకి. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఆయన జీవితంలో ఎమర్జెన్సీ కాలంలో ఉన్న అర్థంలేని నిర్బంధం వల్ల దీర్ఘకాలం సెలవు పెట్టి దేశవిదేశ పర్యటనలకెళ్ళాడు లక్ష్మణ్. లక్ష్మణ్ కార్టూన్లకీ సెన్సారా అని అబ్బురపడింది దేశమంతా. ఈ విషయంలోనే లక్ష్మణ్ ప్రధాని ఇందిరని కలిస్తే ఆమె కూడా అలాగే ఆశ్చర్యచకిత అయ్యిందట… ఏ అంతర్జాతీయ కార్టూనిస్టుకీ తీసిపోని లక్ష్మణ్‌కి నిజంగానే అంతర్జాతీయంగా చాలా అవకాశాలు వచ్చాయి. దేశాభిమానంతోనే దేశంలో ఉండిపోయాడు… భారతదేశం గురించి ఒకసారి బెర్ట్రండ్ రస్సెల్‌తో గొడవపడ్డాడు కూడా. భారతీయులు కనుగొన్నది జీరో అన్నాడట రెస్సెల్‌. జీరో అంటే ఏమీలేదు అని అర్థం చేసుకున్నాడు లక్ష్మణ్. రస్సెల్‌ నిజానికి చెప్పదలచుకున్నది భారతీయులే సున్నని కనిపెట్టారు, లేకుంటే గణిత శాస్ర్తం ఇంత సులభమయ్యేది కాదని ఆయన అర్థం. లక్ష్మణ్ కార్టూన్లూ, కథలకి బొమ్మలే కాదు అపురూపమైన క్యారికేచర్లు గీయగలడం ఆయనకు ఒక్కడికే తెలిసిన విద్య. కార్టూన్లతోపాటు ఆయన కాకుల బొమ్మల్ని గీస్తాడు. పక్షులన్నింటిలో కాకే తెలివయిందని ఆయన వాదన. వాటిని ఎంత త్వరత్వరగా గీస్తాడో అంత త్వరగానూ అమ్ముడుపోతాయట. కళని నిలబెడుతున్న వాళ్ళు ఉండబట్టే కళ కూడా ఉంది. భారతీయులకు సెన్సాఫ్ హ్యూమర్ (హాస్యరసికత) లేదనేది యూరోపియన్ల వాదం. ఇది అబద్ధమని చాలా పోరు సలిపాడు లక్ష్మణ్. తన కార్టూన్ల ద్వారా భారతీయుల సెన్సాఫ్ హ్యూమర్‌ని తట్టి లేపడమే కాకా చాలా చాలా మంది కార్టూనిస్టులకి స్పూర్తి అయ్యాడు. దేశం కూడా లక్ష్మణ్‌ని సముచితంగా గౌరవించిందనే చెప్పాలి. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులొచ్చాయి. కార్టూనిస్టులకు అంతటి అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమే. అలాగే రామన్ మెగసెసె అవార్డూ అందుకున్నాడాయన. ఇక పాఠకుల నుంచి వచ్చిన అభిమానం, ఆదరణలకు అంతే లేదు. ఆయన కార్టూన్ పాత్ర కామన్ మ్యాన్‌ని శిల్పంగా చెక్కించి పుణెలో ప్రతిష్టించారు. ఈ గౌరవం ఏ కల్పిత పాత్రకీ లభించలేదు. అమెరికాలో మిక్కీ మౌస్‌కి తప్ప.

తవ్వేసిన రోడ్లూ, మురికికుప్పలూ, కరెంటు కట్, అవినీతి, ధరల పెంపూ, నీటికొరతా, వరదలూ, కష్టాలూ కడగళ్ళూ, స్కాంలూ, రాజకీయాలూ, పోలీసుల దౌష్ట్యం. ఇత్యాది నానా విధాల అవలక్షణాలన్నింటిపైనా వందలాది కార్టూన్లు చిత్రించాడాయన. సమాజంలో ఇవన్నీ కొనసాగుతున్నంత కాలం కార్టూనిస్టులకి చావు లేదనేది ఆయన సిద్ధాంతం.

రాజకీయ వ్యంగ్యచిత్రాలూ క్యారికేచర్లూ సామాజికాంశాలపై పాకెట్ కార్టూన్లే కాకుండా బిజినెస్, సైన్సు కార్టూన్లూ వేస్తారు. కథలూ, పుస్తకాలూ రాశారు. పిల్లల కథలకు బొమ్మలు వేశారు. ఆ కథలు రాసింది ఆయన సతి కమల. పాతతరం నాయకుల్లో ఉన్న సిద్దాంత, వ్యక్తిత్వ వైరుద్ధ్యం నేటి నాయకుల్లో కొరవడిందనే ఆవేదన ఆయన్ని తొలుస్తున్నా కార్టూన్లకేం కొదవలేదు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ కూడా యథావిధిగా కార్టూన్లు చిత్రిస్తున్నారు. లక్ష్మణ్ త్వరగా కోలుకుని వెయ్యేళ్ళు వర్థిల్లాలని కోరుకుంటూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here