పాఠశాల అంటే ఏమిటి? ఉపాధ్యాయుడు అంటే ఎవరు?

0
162

పాఠశాల అంటే ఏమిటి? ఉపాధ్యాయుడు అంటే ఎవరు?

… ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఒక తరం నుంచి మరో తరానికి మన సాంప్రదాయిక (విజ్ఞాన) సంపదను అందించడంలో పాఠశాల ఎప్పుడూ ఒక ప్రధాన సాధనంగా ఉంటోంది. వర్తమాన కాలంలో పాటశాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే మనదంతా ఇప్పుడు ఆర్థికం చుట్టూ తిరుగుతున్న జీవితం. పై కర్తవ్యాన్ని పాఠశాలకన్నా కుటుంబమే ఎక్కువగా నిర్వర్తిస్తున్న కాలం మనది. అందువల్ల పాఠశాలను మనం బలోపేతం చేసుకోవాలి. అప్పుడే మానవ సమాజం మరింత భద్రంగా ముందుకు సాగుతుంది.

 వీలున్నంత జ్ఞానాన్ని మన పిల్లలకందించే సాధనమే బడి అనుకోవడం తప్పు. పాఠశాల అంతకంటే చాలా గొప్పది. నిజానికి జ్ఞానం అనేది ప్రాణం లేనిది. బడిలో ఉండేది సజీవమూర్తులు. ఎదుగుతున్న తరానికి సమిష్టి సమాజాభ్యుదయాని కవసరమైన అర్హతలనందించి, సామర్థ్యాల్ని పెంపొందించే కర్తవ్యం పాఠశాల చేయ్యాల్సి ఉంటుంది. అట్లని వ్యక్తిత్వం లేనివాళ్ళనుగా పిల్లల్ని మార్చగూడదు. స్వయం వ్యక్తిత్వం, స్వంత ఆశాలు లేని మూసపోసిన వ్యక్తుల వల్ల సమాజం ముందుకుపోదు. ముడుచుకుపోతుంది. పాఠశాల స్వంతంగా ఆలోచించగల వ్యవహరించగల వ్యక్తుల్ని తయారు చేయాలి. అదే సమయంలో తమ జీవసార్థకత, సామాజిక శ్రేయస్సులోనే దాగి ఉందని వారు గుర్తించేలా చేయ్యాలి. మన ఇంగ్లీషు విద్యా వ్యవస్థ ఈ దారిలో నడుస్తోందని నేను నమ్ముతున్నాను.

మరిలాంటి ఆదర్శం ఎరికైనా ఎలా వొంటబడుతుంది? నీతి సూత్రాలు వల్లిస్తే వొంటబడుతుందా? అసాధ్యమని నా నమ్మకం. వొట్టి మాటల వల్ల ఏమీ జరగదు. మంచి మాటలు చెప్పడం వల్లా వినడం వల్లా కాదు వ్యక్తిత్వలు రూపుదిద్దుకొనేది. చేసే శ్రమవల్లా పని వల్లా మాత్రమే వ్యక్తిత్వాలు రూపొందుతాయి.

విద్యార్థి స్వయంగా అభ్యసనంలో పాల్గొనేలా చేయ్యడమే బోధనా పద్ధతుల్లో ముఖ్యమైన అంశం. తొలినాళ్ళలో బలపం పట్టి రాయడం కావచ్చు. విశ్వ విద్యాలయంలో పరిశోధన చేయ్యడం కావచ్చు. పద్యాన్ని వల్లె వెయ్యడం కావచ్చు. కాంపోజిషన్ రాయడం కావచ్చు. ఒక అంశాన్ని విశ్లేషించడం కావచ్చు. ఒక లెక్క చెయ్యడం కావచ్చు. ఎందులోనైనా ఇమిడి వున్న కీలకాంశం విద్యార్థి పాల్గొనడం.

ఇలా విద్యార్థి పాల్గొనాలంటే తన లక్ష్యం సాధించాలంటే అతనికి ప్రోత్సాహం కావాలి. మొదట మనం ప్రోత్సహిస్తే అతడు లక్ష్యం సాధించినప్పుడు ఆ సాధనే ఒక ప్రోత్సహంగా మారుతుంది. ఇక్కడే విద్యకు సంబందించి భిన్నాభిప్రాయాలు పుట్టుకొస్తాయి. అయితే పాఠశాల విలువను బేరీజు వేయ్యడానికి ఈ అభిప్రాయాలే మనకెంతో ఉపకరిస్తాయి.

లక్ష్యసాధనవైపు ఒక్కొక్కరిని ఒక్కొక్కటి నడిపించి ఉండొచ్చు. భయం ఒకర్ని నడిపిస్తే మరొకర్ని నిర్బంధం నడిపంచవచ్చు. పేరాశ ఒకర్ని నడిపిస్తే మరొకర్ని ఆ అంశం పట్ల ఆసక్తి నడిపించి ఉండొచ్చు. సత్యం పట్ల ఆకాంక్ష, అవగాహన మరికొరి ప్రేరణ కావచ్చు. ప్రతి బిడ్డకూ సహజంగా ఈ కుతూహలత్వం ఉంటుంది. దురదృష్టవశాత్తు దీన్ని మనం మొదట్లోనే తుంచేసి వెనక్కి నెడుతుంటాము. లక్ష్యసాధనకు ప్రేరణలుగా భయం, నిర్బంధం ఆశ, ఆకాంక్ష, కుతూహలం, అవగాహనా, అన్వేషణాసక్తీ ఏవి ఉంటాయి అనేది పాఠశాల నిర్వహణను బట్టి, ఉపాధ్యాయుల దృక్పధాన్ని, ధోరణిని బట్టి ఉంటాయి. దీన్ని మనమందరం ఒప్పుకోక తప్పదు. భయపెట్టి, నిర్బంధ పరిచి, కృత్రిమాధికారంతో విద్యాబోధన చేసే స్కూళ్ళు నా దృష్టిలో పరమ పనికిమాలినవి. ఇవి విద్యార్థి మనో వికాసాన్ని, నిజయితీని, ఆత్మ విశ్వాసాన్ని సర్వనాశనం చేస్తాయి. లొంగుబాటతనాన్ని నేర్పిస్తాయి. అయితే బడి నుంచి వీటిని ఎలా తరిమికొట్టాలి?

దీనికి సులభమైన మార్గముంది.అదే ఉపాధ్యాయుడికి వీలున్నంత స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించడం. అతడి సమున్నత మానవతా విలువల్నిబట్టి, మేధో అర్హతల్ని బట్టి మాత్రమే విద్యార్థుల్ని గౌరవించే పరిస్థితిని, వాతావరణాన్ని బడిలో కల్పించడం.

గుర్తింపు కోసం ఆకాంక్ష నేది మానవ సహజం. ఇది మనిషికొక చోదక శక్తిగా పని చేయ్యడం కూడా అంతే సహజం. ఈ మానసిక ప్రవృత్తే లేకపోతే మానవుల మధ్య సహకారం అసాధ్యమయ్యేది. తోటి మనిషి నుంచి లభించే గుర్తింపు అనేది సమాజాన్ని సమైక్యంగా ఉంచుతున్న ఒక బంధం. అయితే దీనికి రెండు పార్శ్వాలున్నాయి. ఇందులో మంచి ఉంది, చెడూ ఉంది. సాటి మనుషుల్నించి గుర్తింపు, ఆమోదం కోరుకోవడం వరకే అయితే అది ఆరోగ్యకరమైన చోదకశక్తి. అలాగాక సాటి మనుషుల కంటే తనకు ప్రత్యేకమైన, తెలివైనా వ్యక్తిగా గుర్తింపు కావాలని తాపత్రయ పడిపోవడం మాత్రం ప్రమాదకరం. ఇది వ్యక్తిని, సమాజాన్ని కూడా కష్టాల పాలుచేస్తుంది.

పాఠశాల ఉపాధ్యాయుడు దీన్ని మనసులో ఉంచుకోవాలి. విద్యార్థుల్లో ఈ గుర్తింపు, తాపత్రయాన్ని పెంచడం చాలా సులభం. దీనివల్ల విద్యార్థి ఉత్సాహంగా ముందుకొచ్చే మాట కూడా నిజం. కానీ సరైన పద్దతి మాత్రం కాది.

డార్విన్ చేసిన మనుగడ కోసం పోరాటం ప్రకృతి వరణం సూత్రీకరణలకు వక్ర భాష్యాలు చెప్పినవారున్నారు. ఎంత పోటీలోకి నెట్టితే అంత రాణిస్తారన్న తమ వాదానికి డార్విన్ సిద్ధాంతం ఓ అధికారిక శాస్త్రముద్రగా వీళ్ళు చూపిస్తుంటారు. వ్యక్తుల మధ్య జరిగే విధ్వంసకర ఆర్థిక పోరాటాల్ని, పోటీల్ని డార్విన్ని అడ్డం పెట్టుకొని సమర్థించిన వారు ఉన్నారు. ఇది పసలేని వాదం. మనిషిచుట్టూ ఓ సమాజం ఉంది.అందులో అతడు బాగం. మనుగడ కోసం చేసే పోరాటాన్ని కూడా అతడు సమాజం మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. అందువల్ల అతడు సమాజానికెంతో రుణపడి ఉంటాడన్నది వాస్తవం. ఒక పుట్టలోని చీమల్ని చూడండి. మనుగడ కోసం అవి ఒకదానితో ఒకటి పడే గొడవల్ని చూడండి. ఈ గొడవ పడడం వల్లనే చీమనలు మనుగడ సాధిస్తున్నాయా? అలానే మనుషులు కూడా.

పిల్లల్ని తీర్చిదిద్దేప్పుడు మన టీచర్లు ఇక్కడే జాగ్రత్త పడాలి. జీవిత లక్ష్యం విజయమే అనే ధోరణి వీళ్ళలో పెంచకూడదు. తన సహచరుల నుంచిఆదరణ, సహకారం అందుకోవడమే వ్యక్తికి అసలైన విజయం. అది తాను వారికెంత ఇస్తున్నాను అనేదాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల మనిషి విలువను అతడు సమాజానికిచ్చే దాన్ని బట్టి తప్ప ఇతరుల నుంచి తీసుకునే దాన్ని బట్టి లెక్కించలేము.

పనిలో ఆనందం, ఫలితంలో ఆనందం, ఈ ఫలితం సమాజాన్ని కూడా ఉపయోగపెట్టడంలో ఆనందం అనేవి మూడు కీలకమైనవి. నవతరానికి ఈ మానసిక చేతన కల్గించడమే పాఠశాల గొప్పదనం. ఉపాధ్యాయుడి ఔన్నత్యం. అత్యున్నత శిఖరాల్ని అందుకోవలాలన్న తపన, విజ్ఞాన దాహం, క్రియా నైపుణ్యం. ఈ మానసిక పునాది వల్లనే సాధ్యమవుతున్నాయి.

బలప్రయోగంతో, అధికారంతో, వ్యక్తిగత వాంఛ ప్రకోపాలతో విద్య నేర్పడం కన్నా పైన చెప్పుకొన్న క్రియాశీల మానసిక చేతనను ప్రబుద్ధం చెయ్యడం ద్వారా బోధించడం సులభం. ఈ బోధన ఎంతో విలువైంది కూడా. చిన్న పిల్లలు ఆటల పట్ల చూపే అభిరుచి లాంటి అభిరుచి, గుర్తింపు కోసం ఆరాటపడే లాంటి ఆరాటం విద్యార్తుల్లో కల్గించాలి. సామాజిక అవసరాల్ని గుర్తింపచేయాలి. దీన్నుంచి విజసోపానాల్ని విద్యార్థులు ఎక్కాలి. తద్వారా వాళ్ళకో గుర్తింపు రావాలి. ఇదీ అసలైన విద్య. ఇదీ విద్యా రహస్యం.బడి ఈ లక్ష్యంతో పని చేస్తే ఎదిగే బిడ్డలు దీన్ని హత్తుకుంటారు. బడి నేర్పే పాఠాల్ని, ఇచ్చే కృత్యాల్ని తాము పొందుతున్న బహుమతులుగా స్వీకరిస్తారు. సెలవుల కంటే బడి అంటేనే ఎక్కువ ఇష్టపడే పిల్లల్ని నేనెందరినో ఎరుగుదును.

ఇలాంటి పాఠశాల ఓ సుందర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో ఉపాధ్యాయుడు ఓ కళా తపస్వి. ఐతే ఇలాంటి స్కూళ్ళు ఉండాలంటే కొన్ని తప్పనిసరి నిబంధనలు అవసరం. వాటిలో మొదటిదేమంటే ఉపాధ్యాయుడు కూడా ఇటువంటి స్కూళ్ళలోనే చదివి ఉండడం. రెండోది పాఠ్యాంశాల ఎంపికలో బోధనా పద్ధతుల ఎంపికలో ఉపాధ్యాయుడికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండడం. ఇలా కాకుండా బయటి నుంచి ఒత్తిడి, అధికార నిర్బంధం ఉంటే ఉపాధ్యాయులు తమ విధి నిర్వహణలో ఆనందాన్ని ఎప్పటికీ పొందలేరు.

నా మాటలు విన్నాక మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఎంతసేపటికీ నేను మన భవిష్యత్తరానికి ఏ లక్ష్యంతో, ఏ దీక్షతో బోధించాలో చెప్పానే తప్ప ఏమి బోధించాలో మాత్రం చెప్పలేనది మీ కనిపిస్తుంది. భాష నేర్పడం ముఖ్యామా? సైన్సు నేర్పడం మంచిదా? సాంకేతిక విద్య అవసరమా? అనే విషయాల జోలికి నేను పోలేదు. బోధనా రీతులను గురించి నేనసలే ప్రస్తావించలేదు.

ఎందుకంటారా? ఇవన్నీ నా దృష్టిలో ప్రాధాన్యత క్రమంలో మొదటి అంశాలు కాదు. ఒక యువకుడికి వ్యాయమశాలలో మంచి శిక్షణనిస్తే అతడు తరువాత కాలంలో ఎలాంటి శారీరక శ్రమనైనా చేయగలడు. ఇది మానసిక శిక్షణకు వర్తిస్తుంది. సరైన మానసిక చేతన ప్రబుద్ధం చేయగలిగితే ఏ సబ్జెక్టునైనా అవలీలగా నేర్చుకుంటాడు. అందువల్ల సాంప్రదాయక భాషా శాస్ర్తాన్ని, చరిత్రను నేర్పడమా? ఆధునిక జీవశాస్ర్తాన్ని బోధించడమా? సమకాలీన విద్యలో దేనికి ప్రాధన్యత నివ్వాలి? అనే వాగ్వివాదాల జోలికి నేను పోవడం లేదు.

జీవితంలో నేరుగా ఉపయోగపడే ప్రత్యేక నిర్థిష్ట జ్ఞానాన్ని స్కూల్లో అందించాలి అనే ధోరణిని నేను వ్యతిరేకిస్తాను. మన స్కూళ్ళల్లో నేర్పే ఈ ప్రత్యేక నైపుణ్యాలకన్నా జీవితావసరాలు చాలా విస్తృతమైనవి. అంతేకాదు విద్యార్థి అంటే జీవం లేని ఓ పరికరం లాంటి వాడు కాదు. అతడు సంవేదనాశీలి. స్వయం వ్యక్తితత్వం గల ప్రాణి. ఒట్టి నిపుణునిగా అతనిని చూడ్డం పాఠశాలకు తగని పని. ఈ సూత్రం మన సాంకేతిక పాఠశాలల కూడా వర్తిస్తుంది. సొంతంగా ఆలోచించడం, ఒక నిర్ణయానికి రాగలగడం అనే లక్షణాలను పెంచాలి తప్ప ప్రత్యేక జ్ఞానాన్ని అందించినంత మాత్రన సరిపోదు. విద్యార్థి తన సబ్జెక్టుకు సంబంధించిన ఆధునికాంశాల్ని బాగా జీర్ణం చేసుకోగలిగితే,సొంతంగా కృషి చెయ్యడం అలవాటు చేసుకోగలిగితే అతడు ఖచ్చితంగా భవిష్యత్తు అవసరాలకు, అభివృద్ధికి తగినట్లుగా తనకు తాను మారగలడు. ఈ సామర్థ్యం ఒకానొక అంశానికి సంబంధించిన విస్తృత జ్ఞానం మాత్రమే ఉన్న విద్యార్థికి అలవడ్డం అసాధ్యం. మంచి పాఠశాలలు దీన్నెప్పుడూ మరిచిపోవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here