పిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేవా?

0
130

పిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేవా?

– గిజూ భాయి

          పిల్లలని ఏమాత్రం కొట్టకూడదు. శరీరానికి తగిలే దెబ్బని వారు త్వరగా మరిచిపోవచ్చు. కాని ఆ దెబ్బలవల్ల వారి మనస్సుల్లో కలిగే భయం చాలా భయంకరమైనది. ఆ భయం పిల్లలను పిరికివాళ్ళుగా, అబద్ధాలు చెప్పేవాళ్ళుగా మార్చివేస్తుంది. ఆ భయమే పెద్దయ్యాక వారి చెడు నడతనకు పునాది అవుతుంది. సమాజం, మతాలు, శాస్త్రాలు, ఆచారాలు, జాతులు, అధికారం వీటన్నింటి పట్ల బాల్యం నుంచే మనలో భయాలు పాతుకుపోయి ఉంటాయి. ఇతరులంటే ఉన్న భయం కారణంగా అబద్దాలు చెబుతాం. రోజు మనం పిల్లలని భయపెట్టామనుకోండి. రేపుఉపాధ్యాయులు భయపెడతారు. ఆ తరువాత పోలీసులు భయపెడతారు. ఇలాంటి భయాల నుంచి మీరు పిల్లలను దూరంగా ఉంచాలి. కొట్టి తిట్టి దండించి మీ పిల్లలను పిరికివారుగా, అబద్దాలకోర్లుగా మార్చకండి. తియ్యని మాటలు చెప్పి మోసగించి లేదా లోభం చూపి పిల్లలను పనికి రానివారుగా తయారు చేయకండి. లంచంగా డబ్బులిచ్చి పిల్లను పాఠశాలకు పంపకండి. రేపు డబ్బిచ్చి తప్పుడు తీర్పు రాయించకోగల స్థితికి వారు ఎదుగుతారు. తన అధికారం చెలాయించుకోవాలనో, భూమిని కబ్జా చేసుకోవాలనో ప్రయత్నించి చివరికి ఖూనీలు కూడా చేయగలరు. పిల్లలకి ఇష్టమైన చిరుతిళ్ళు ఇచ్చి వారి చేత పనులు చేయించకండి. రేపు వారు లంచాలు ఇచ్చి పుచ్చుకోవడంలో ఘనులైపోతారు. భయాన్ని, లోభాన్ని జయించగలిగేదే అసలైన విద్య.

పిల్లలకి ధర్మాలు, శాస్త్రాలు బోధించి అచారాలు, సంప్రదాయాలను నేర్పించాలని ఆలోచించకండి. తల్లిదండ్రులు దేవుడితో సమానమని బోధించి, తలవంచి వినయం ప్రకటించాలని అనుకోకండి. ఆ ధర్మాలు మనుషుల జీవితాల్లో వున్నవేకానీ పుస్తకాలల్లోను, ఉపదేశాల్లోను, కర్మకాండల్లోను లేవు. మీరు ధర్మాలు, ఆచారాలను పాటించి నైతికంగా ఉన్నతమైన ప్రమాణాలు కలవారైతే మీ పిల్లలు మిమ్మల్ని పూజించి, మీ అడుగుజాడల్లో నడుస్తారు. మీరు ఆచరించేది ఒకటి, చెప్పేది మరొకటి అయితే వారికీ అదే ద్వంద విధానం అలవడుతుంది. అందుకే ముందుగా మీ ప్రవర్తన సరిగా ఉండాలి.

వండుతన్న పదార్థాలు పిల్లలకి నచ్చుతాయా లేదా అవి సులభంగా జీర్ణమయ్యేవేనా కాదా అని ఆలోచించే తల్లులు ఎందరు ఉన్నారు? పిల్లలకి ఇష్టంలేని పదార్థాలు తినిపిస్తారు. తమకి రుచించేవే వాళ్ళకి అలవాటు చేయాలని చూస్తారు. అంతేనా, తమ అలవాట్ల ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు పిల్లలు కూడా నేర్చుకోవాలంటారు. తమ ఆదర్శాలనే వాళ్ళ మీద రుద్దుతారు. ఆ పిల్లలే తమ కంటే ఉన్నతమైన ఆలోచనలూ, ఆదర్శాలూ కలవాళ్ళుగా తయారు కావచ్చని ఎందుకనుకోరు? మన పూర్వీకుల కంటే మనం ఏ విషయాల్లో ముందున్నమో మనకి తెలుసా?

పిల్లలకి సంబంధించిన విషయాలంటే మన మనస్సుల్లో ఏమాత్రం చోటుంది? అసలు మనం మన స్వార్థపూరిత దృష్టిని వదులుకోగలమా? కొత్త యుగంలో కొత్త భావనలు, కల్పనలు చేసుకోగల అవకాశాన్ని మన పిల్లలకి ఇస్తున్నామా? లేదు!

చెప్పులు వేసుకోవటం, టోపీ పెట్టుకోవడం ఇష్టంలేని పిల్లలు ఉన్నారు. అంత మాత్రానికే ఆ తండ్రికి పరువు నష్టమా? పిల్లలకి పిరికిణీయే కుట్టించాలి. లోలాకులే చేయించాలని వాళ్ళమ్మ అనుకొంటుంది. ఆ పిల్లలకీ ఇష్టాయిష్టాలుంటాయిగా! మన చిన్నతంలో మన ఇష్టాయిష్టాలు పట్టించుకొన్నదెవరు? అప్పుడు మనం బానిసల్లా ఉన్నాం కనుక మన పిల్లలు కూడా మనకి బానిసల్లా ఉండి శిక్ష అనుభవించాల్సిందేనా? తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలకి పిల్లలే ప్రతీకలా? చూడబోతే అలాగే ఉంది. పిల్లలకి తమ పరువు అనేది ఉంటుందా? పెళ్ళికి వెళ్ళారనుకోండి. ఆ సందర్భానికి తగ్గట్టు పిల్లలు దుస్తులు వేసుకోకపోతే పెద్దల పరువేగాపోయేది. అందుకే ఎప్పుడెలాంటి బట్టలు వేసుకోవాలో పెద్దవాళ్లే నిర్ణయించాలి. తల్లిదండ్రుల అహాన్ని సంతుష్టపరిచే సాధనాలు పిల్లలు. వారికి ఆలోచనలూ, కోరికలూ ఏమిటి? రంగులు, రుచులు వాళ్ళకేం తెలుసు?

అమ్మ సంతోషంగా ఉంటే పిల్లలకి మంచి బట్టలు వేసి తయారు చేస్తుంది. ఆవిడ దుఃఖంలో ఉంటే పిల్లలు సంబరంగా ఎలా కనిపిస్తారు? పెద్దవాళ్ళకి పిల్లలు పెద్ద పెద్ద ఆట బొమ్మలు. తమ ఇష్టానుసారం అలంకరించుకొని ఆడించుకొని చూసి సంతోషపడటానికి ఉపయోగపడే సాధనాలు. అయితే ఇవన్నీ కొందరు పిల్లలకే ప్రాప్తం. అదీ వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితేనే!

బట్టలు వేసుకోకుండా చెప్పులు, బూట్లు లాంటి అడ్డంకులేవీ లేకుండా స్వేచ్ఛగా, హాయిగా గెంతటం చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం. ఎండలు మండుతున్నా పిల్లలకి బట్టలు వేయాల్సిందేనా? ఇరుకుగా ఉన్న బట్టల్లో గెంతటానికి, పరుగెత్తటానికి వీలులేక అసౌకర్యంగా ఉన్నా పాపం ఆ పిల్లలకి విముక్తిలేదు. బట్టలు లేకుండా ఉంటే అసహ్యం కదూ! వాళ్ళ అందమైన శరీరాలను బట్టలతో కప్పితేనే మనకి ఆనందం. ఈ ఆనందానికి కళాత్మక దృష్టి బలయిపోతున్నదని గ్రహించలేం. చిన్నప్పటి నుంచి బట్టలు వేసుకోవడం నేర్చుకోకపోతే పెద్దయ్యాక కూడా అలాగే ఉంటే ఎలా?

సూర్య కిరణాలు, చల్లటిగాలి – ఈ రెండూ పిల్లలకి నేస్తాలే. హాయిగా మట్టిలోనూ, నీళ్ళలోనూ ఆడుకోవటమంటే ఇష్టపడని పిల్లలెవరు? సరే! అలా ఎండకీ, గాలికీ తిరిగి ఆడితే జ్వరాలు రావూ? మట్టిలో ఆడితే బట్టలు పాడయిపోవూ? నీళ్ళలో ఆడితే జలుబు చేస్తుంది. ఇవండీ మన ఆలోచనలు! పరుపు మీద ఎక్కి ఆడుకొంటే అది పాడవుతుంది. మంచి బట్టలు వేసుకొని ఆటలకి వెడితే ఎలా? అవి పాడవుతాయి. ఇదండీ న్యాయం! మనకైతే ఒక నియమం, పిల్లలకైతే మరొకటీనా?

ఇంట్లో వారికి నచ్చిన వస్తువులేవీ వారికి అందుబాటులో ఉండవు. బట్టలైనా, మరేవైన మనం తీసి ఇవ్వాలి. తాము కూడా పనులు చేయాలని పిల్లలకు అనిపించినా పెద్దలు చేయనివ్వరు. ఇలా ప్రతి విషయంలో పిల్లలకు అడ్డుపడి వారి స్వేచ్ఛకు ఆటంకం కలిగించి, పెద్దయ్యాక మనలాంటి బానిసలుగానే తయారయ్యేలా చేస్తున్నాం మనతోపాటు వాళ్ళనీ పనులు చెయ్యనిచ్చి, వారితో పాటు మనమూ ఆడుకోగలికితే? వారి మీద విశ్వాసం వుంచి వారికి ఇంట్లో సరైనా స్థానం ఇవ్వగలిగితే ఈ ధరిత్రి స్వర్గంగా మారుతుంది. ఒక్క నిమిషం ఆలోచించండి. మీ పనులకు ఎవరైనా అడ్డంపడితే ఊరుకొంటారా? అలాగే మీ పిల్లలూ అని అనుకోలేరా?

పిల్లల సుఖం, సంతోషం, అల్లరి, అన్నింటినీ మించి వారి స్వేచ్ఛతోనే మనకు స్వర్గం సాధ్యపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here