“బయోలాజికల్ హెలికాప్టర్” – తూనీగ

ఉపాధ్యాయ లోకం బ్లాగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్ధి లోకం సైన్స్ ప్రయోగాలు సైన్స్ సెంటర్

“బయోలాజికల్ హెలికాప్టర్” – తూనీగ

వాన కురిసి వెలసిన కొంత సేపటికి ఆకాశంలో గమనిస్తే తూనీగలు గుంపులు గుంపులుగా చిన్నసైజు విమానాలు లేదా హెలికాప్టర్లు దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంది. రక రకాల విన్యాసాలు చేస్తూ ఆకాశంలో స్వైర విహారం చేస్తుంటాయి. తోటలలో, ఆరుబయట గమనిస్తే పూల మొక్కల మీద వాలుతూ రివ్వున ఎగిరిపోతుంటాయి. ఈ మధ్య తూనీగ మీద కూడా ఒక మంచి పాట వచ్చింది. తూనీగ… తూనీగ… ఎందాక పరిగెడతావే… అని ఆవంక, ఈ వంక అని లేకుండా అన్నీ వంకలకు క్షణం తీరక లేకుండా పరిగిస్తుంటాయి. తూనీగలతో మనకి పనేంటో అంటారేమో..

మనం ప్రతీది ప్రకృతి నుంచే కదా నేర్చుకున్నాం. పక్షుల్లా ఎగరలేమా అని ప్రయోగాలు చేసి విమానాన్ని కనుగొన్నారు రైట్ సోదరులు. అనేక రకాల విన్యాసాలతో ఎరిరే తూనీగలాంటి, తేలికపాటి విమానాలను, హెలికాప్టర్లను తయారు చేయాలని ఎయిరో డైనమిక్స్ శాస్ర్తవేత్తల కోరిక. అందుకే తూనీగ మీద అనేక పరిశోధనలు జరుపుతున్నారు. ఎయిరో డైనమిక్స్ ప్రయోగాలకు తూనీగను మించినది లేకపోవడం విచిత్రమనిపిస్తుంది.

ప్రకృతిలో తూనీగలాగా గాలిలో ఎగిరే కీటకం గాని, సాధనం గాని ఇంకొకటి లేదని ఎయిరో డైనమిక్స్ నిపుణులు గుర్తించారు. అందుకే తూనీగను బయోలాజికల్ హెలికాప్టర్ అని పిలుస్తున్నారు.

తూనీగలు ముందుకు వెనుక్కు ఎగరగల్గుతాయి. ఉన్నట్టుండి తన దిశను మార్చుకోగలవు. కొంత కాలం పాటు గాలిలో అలాగే నిలబడగలవు. వెంట వెంటనే వేగాన్ని పెంచుకోగల్గుతాయి, తగ్గించుకోగల్గుతాయి. తన రెక్కల్ని నలభైఐదు డిగ్రీల కోణంలో వుంచి రెక్కలను కదిలిస్తూ హఠాత్తుగా ఎగరగల్లుతాయి. అదే విధంగా హఠాత్తుగా దిగగల్గుతాయి. ఒక్కోసారి గాలిలో అలాగే వ్రేలాడగల్గుతాయి. ఈ విధంగా చేసేటప్పుడు రెక్కల క్రింద చిన్న చిన్న సుడి గాలుల అలలు ఏర్పడేలా చేస్తాయి.

పరిసరాలలో మార్పులను గ్రహించి వేగవంతంగా చర్యలు తీసుకొనే విధంగా దీని నాడీ వ్యవస్థ అభివృద్ధి చెంది వుంది. దీని నాడీ వ్యవస్థను దాని రెక్కలపైన చూడవచ్చు.

ఎంతకో శక్తివంతమైన విమానం తన బరువు కన్నా ఒకటి, మూడు రెట్ల నుంచి బరువును మోయగల్గుతుంది. ఆదే తూనీగ తన కన్నా ఏడు రెట్లు బరువు గాలిలో మోయగల్గుతుంది. కొంత మంది కుర్రాళ్ళు తూనీగ తోకలకు చిన్న చిన్న రాళ్ళను దారాలతో కట్టి వదలడం మీరు గమనించి వుంటారు. ఆ చిన్న రాళ్ళతో పాటు అవి ఎగరటం గమనించి వుంటారు. తూనీగకు ఇంత శక్తి ఎలా లభిస్తున్నదనేది శాస్ర్తజ్ఞుల ప్రశ్న.

వీటి పరిశోధనల ఆదారంగానే ఎయిరో డైనమిక్ శాస్ర్తవేత్తలు రాడార్లకు అందని, ఆకాశంలో రక రకాల విన్యాసాలు చేసి శత్రు విమానాలను తప్పించుకోగల్గే విమానాలను తయారు చేయగల్గారు. ఇంకా తూనీగలాంటి ముందుకు, వెనక్కు కదిలే తేలికపాటి విమానాలు తయారు చేయాలని పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

తూనీగను బహుశ దాని శరీర నిర్మాణం, రంగు, పెద్ద కళ్ళు, పెద్ద రెక్కలను బట్టి దీనికి డ్రాగన్ అని పేరు పెట్టి ఉంటారేమో. అయితే ఇది మానవుడికి ఎటువంటి హాని చేయదు. ఇది దోమలను నిర్మూలిస్తుంది.

విచిత్రమైన విషయం ఏమిటంటే మిగతా కీటకాల్లోలాగా దీని పెరుగుదలలలో వివిధ దశలు లేవు. ప్యూపా, లార్వా పిల్ల దశలలో ఎక్కువ సమయం వుండదు. వెంటవెంటనే జరిగిపోతాయి. గుడ్డు నుంచి వెలువడిన వెంటనే చాలా చురుకుగా వుండి పిల్ల్‌ తూనీగ వెంటనే పరుగులు తీస్తుంది.

దీని కాళ్ళు అన్నీ ఒక గుత్తిగా ముందు వైపున ఉంటాయి. ఇవి నడవటానికి అసలు ఉపయోగపడవు. ఈ కాళ్ళు ఒక చిన్న బుట్ట ఆకారంలో ముడుచుకొని వుంటాయి. ఎగురుతున్నప్పుడు ఆహారం దొరికినప్పుడు ఈ కాళ్ళతో పట్టుకొని మరలా ముడుచుకొంటాయి. తను ఆహారాన్ని తీసుకొనేదాకా,కాళ్ళతో ఆహారాన్ని అలాగే పట్టుకొని వుంటుంది. కొంతమంది పరిశోధకులు తూనీగ తోకను వంచి దాని నోటికి అందించినప్పుడు అది అందిన వరకు తినేయడం గమనించారు. అంతేకాదు రెండు గంటల వ్యవధిలో అది నలభైరెండు కీటకాలను ఆహారంగా తీసుకొందని గ్రహించారు.

దీని కళ్ళు చాలా పెద్దవిగా వుంటాయి. ఈ కంటి మీద అనేకమైన మెరుస్తూండే నాబ్స్ వుంటాయి. వీటిని ఫేసెట్స్ అంటారు. ఇది ఒక్కొక్కటి ఒక కన్నులాగా పనిచేస్తుంది. అందువల్ల ఇది గాలిలో ప్రతి ఒక్క వస్తువును ఫైటర్ ఎయిరోప్లైన్లో పైలెట్‌లాగా గుర్తించగల్గుతుంది.

అప్పుడే పుట్టిన తూనీగను “నింప్” అంటారు. ఇది నీటి అడుగు భాగాన వుంటుంది. అడుగు భాగంలో పాకుతూ నీటి మొక్కలను అంటిపెట్టుకొని వుంటుంది. లార్వా దశలోనే దీనికి తూనీగ లక్షణాలు వుంటాయి. దీని క్రింది పెదిమ పెద్దదిగా హుక్స్ కలిగి దాని ముఖం ఒక బుల్ డాగ్ ఆకారంలో వుంటుంది.

తూనిగలు 2600 లక్షల సంవత్సరాల క్రితమే జీవించాయని జీవశాస్ర్తజ్ఞులు అంచనా వేశారు. పెలియోజువాయిక్ యుగం నాటి తూనీగకు ఈనాటి తూనీగకు ఎలాంటి తేడాలు లేవు. ఇది పరిణామక్రమంలో గమనిస్తే వింతైన విషయమే. అయితే శాస్ర్తజ్ఞుల అంచనా ప్రకారం ఇవి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడి, విజయవంతంగా జీవిచటం వల్ల దీని శరీర నిర్మాణంలో ఎటువంటి మార్పులు జరుగలేదు.

ఈ విధంగా కీటకాలలో అత్యంత వైవిధ్యంగల తూనీగ శాస్ర్త విజ్ఞానానికి తోడ్పడడం వింతైన విషయమే.

బహుదూరపు బాటసారి… ఈ చిన్ని తూనీగ..

అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే జీవిగా గుర్తించిన శాస్ర్తవేత్తలు

ఖండాలు, మహాసముద్రాలు దాటుతూ వేల మైళ్ళ దూరం ప్రయాణించే చిన్ని తూనీగలను శాస్ర్తవేత్తలు గుర్తించారు. జంతు ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే జీవులు ఇవేనని నిర్థారించారు. పాంటాలా ఫ్లావెసెన్స్ అనే జాతి తూనీగలు భారత్, జపాన్, అమెరికా, కెనడా, కొరియా దేశాలు సహా దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాల్లో దర్శనమిస్తాయి. అన్ని ప్రాంతాలలోనూ పాంటాలాల జన్యు రూపం ఒకేలా ఉన్నట్లు రుట్జర్స్ విశ్వవిద్యాలయం నెవార్క్ శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఎక్కడి పాంటాలాలు అక్కడి పాంటాలాలతోనే లైంగిక ప్రక్రియ పాల్గొని ఉంటే… భిన్న ప్రాంతాల్లోని పాంటాలాల జన్యుసమూహం వేర్వేరుగా ఉండేదని వివరించారు. పాంటాలాలు ప్రపంచవ్యాప్తంగా అసాధారణ రీతిలో ప్రయాణిస్తూ… లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్లే అన్ని ప్రాంతాల్లోనూ జన్యు రూపం ఒకేలా ఉందని స్పష్టం చేశారు. పాంటాలాలు ఖండాంతరాలను దాటి ప్రయాణిస్తాయని తమ అధ్యయనం నిరూపిస్తోందన్నారు. పాంటాలాల ప్రయాణ వ్యాప్తి 7081 కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా. ఉత్తర అమెరికాలోని మోనార్క్ సీతాకోక చిలుకల దాదాపు 4023 కిలోమీటర్ల దూరం వలస వెళ్తుంటాయి. అత్యధిక దూరం వస వెళ్లే కీటకాలుగా ఇప్పటి వరకు వాటినే భావించేవారు. ఇప్పుడు ఈ తూనీగలు మోనార్క్ సీతాకోక చిలుకల రికార్డును అధికమించాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *